అసెంబ్లీ ఎన్నికలు... ఓటు హక్కు వినియోగించుకున్న ఖుష్బూ, చిదంబరం

  • మైలాపూర్‌లో ఓటు వేసిన బీజేపీ నాయకురాలు ఖుష్బూ
  • కారైకుడిలో ఓటు వేసిన కాంగ్రెస్ నేత చిదంబరం
  • బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల కోసం పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ మైలాపూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి మాజీ గవర్నర్ తమిళిసాయి సౌందరరాజన్, డీఎంకే నుంచి డి. వేలు మధ్య ప్రధానమైన పోటీ ఉంది.

అన్నాడీఎంకే పార్టీ అధినేత ఈపీఎస్ సేలంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం కారైకుడి, ఎన్టీకే చీఫ్ సెంథమిలన్ నీలాంకరై పోలింగ్ స్టేషన్‌లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు, పశ్చిమ బెంగాల్‌లోని 152 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలకు గాను మిగిలిన142 చోట్ల ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. తమిళనాడులో డీఎంకే, టీవీకే,  అన్నాడీఎంకేల మధ్య ప్రధాన పోటీ నెలకొనగా, బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీగా ఉంది.

పశ్చిమ బెంగాల్‌లో మొదటి విడతలో 3.6 కోట్లమందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1.75 కోట్ల మంది మహిళలు ఉన్నారు. తమిళనాడులో 5.73 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 2.93 కోట్లమంది, పురుషులు 2.83 కోట్లమంది ఉన్నారు. పోలింగ్ నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

పుణేలోని బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మహారాష్ట్ర డిప్యూటీ మినిస్టర్ అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడంతో, ఆయన భార్య సునేత్రా పవార్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.

Tamil Nadu Elections
West Bengal Elections
India Elections 2024
DMK
BJP
Khushbu Sundar
P Chidambaram

More Telugu News